దేనికైనా సమయం రావాలి!

అనగనగా ఓ కుర్రవాడు. అతనికి ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా సంపాదించాలని తెగ కోరికగా ఉండేది. తన దాహాన్ని తీర్చేందుకు తగిన గురువు ఎక్కడ దొరుకుతారా అని, ఎదురుచూస్తూ ఉండేవాడు. ఇక ఎలాగైనా సరే... ఓ గొప్ప గురువు దగ్గరకి వెళ్లి అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించాలని బయల్దేరాడు. కుర్రవాడు అలా బయల్దేరాడో లేదో... అతని ఊరి చివరే ఒక పెద్దాయన కనిపించాడు. వెంటనే ఆయన దగ్గరకి వెళ్లి ‘నేను ఓ గొప్ప గురువు దగ్గర శిష్యరికం చేయాలనుకుంటున్నాను. మీ దృష్టిలో అలాంటి గురువు ఎవరన్నా ఉంటే చెప్పగలరా!’ అని అడిగాడు.

‘ఓ దానిదేం భాగ్యం! నాకు తెలిసిన కొందరి పేర్లు చెబుతాను. వారి శిష్యరికంలో నీకు తృప్తి లభిస్తుందేమో చూద్దాం,’ అంటూ కొన్ని పేర్లు చెప్పాడు.

పెద్దాయన చెప్పిన మాటలను అనుసరించి కుర్రవాడు ఆయా గురువులను వెతుక్కుంటూ బయల్దేరాడు. కానీ అదేం విచిత్రమో! ఎవ్వరి దగ్గరా తనకి తృప్తి లభించలేదు. అతని జ్ఞాన తృష్ణ చల్లారలేదు. అలా ఒకరి తర్వాత ఒకరిని వెతుక్కుంటూ, గాలిపటంలా దేశమంతా తిరుగుతూ తన యాత్రలను సాగించాడు. ఎక్కడా అతనికి తగిన బోధ లభించలేదు. అలా ఒకటి కాదు రెండు కాదు పదేళ్లు గడిచిపోయాయి. అతనిప్పుడు కుర్రవాడు కాదు, యువకుడు! చివరికి నిరాశగా కాళ్లీడ్చుకుంటూ తన ఊరివైపు బయల్దేరాడు.

యువకుడు ఊళ్లోకి అడుగుపెడుతుండానే అతనికి ఒకప్పుడు తారసపడిన పెద్దాయన కనిపించాడు. కానీ ఎందుకనో ఆ పెద్దాయన మొహం చూడగానే ఆయన గొప్ప జ్ఞానిలా తోచాడు. ఆయన దగ్గరకి వెళ్లి మాట్లాడుతున్నకొద్దీ... తను ఇన్నాళ్లుగా వెతుకుతున్న గురువు ఆయనే అనిపించింది.

‘నేను పదేళ్ల క్రితం గురువుని వెతుక్కుంటూ మీ దగ్గరకి వచ్చినప్పుడే... మీరు నన్ను శిష్యుడిగా ఎందుకు స్వీకరించలేదు! నా జీవితంలో పదేళ్లు వెతుకులాటలో వృధా కాకుండా ఉండేవి కదా!’ అంటూ నిష్టూరమాడాడు యువకుడు.

యువకుని మాటలకు పెద్దాయన చిరునవ్వులు చిందిస్తూ.... ‘నువ్వు పదేళ్ల క్రితం చూసినప్పటికీ, ఇప్పటికీ నేను పెద్దగా మారలేదు. మారింది నువ్వే! ప్రపంచమంతా తిరుగుతూ తిరుగుతూ నువ్వు అన్ని రకాల వ్యక్తులనూ చూశావు. ఏ మనిషి ఎలాంటివారు అని బేరీజు వేయగలిగే విలువైన నైపుణ్యాన్ని సాధించగలిగావు. ఆ నైపుణ్యంతోనే ఇప్పుడు నన్ను గుర్తించగలిగావు. అందుకే ఈ పదేళ్లు వృధా కానేకాదు. ఏ విషయం మీదైనా ఆసక్తి ఉంటే సరిపోదు. దాన్ని నెరవేర్చుకోగలిగే నైపుణ్యం కూడా సాధించాలి. అప్పుడే నీ లక్ష్యాన్ని సాధించగలిగే అర్హత ఏర్పడుతుంది,’ అంటూ యువకుడిని తన శిష్యునిగా స్వీకరించాడు.


No comments:

Post a Comment