Learn the courses while studying

సాఫ్ట్‌వేర్‌లో లక్షల రూపాయల జీతాలు... సాధారణ డిగ్రీకి సరిపోని సంపాదన... ఇంతేనా! అంత డిప్రెషన్‌ అవసరం లేదు. ఏ డిగ్రీ ఉన్నా నైపుణ్యం లేకపోతే ఎవరికీ ఊరికే పెద్ద జీతాలు ఇవ్వరు. అందుకే మీ డిగ్రీ ఏదైనా మీకు తగిన కంప్యూటర్‌ కోర్సులు చేస్తే మంచి వేతనాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇప్పుడే డిగ్రీలో ప్రవేశించిన వాళ్లు, ఇప్పటికే పూర్తిచేసిన అభ్యర్థులు కొన్ని కోర్సులు చేస్తే ఐటీ ఉద్యోగాలు అందుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 
సాధారణంగా చాలామంది గ్రాడ్యుయేట్లు డిగ్రీ పూర్తయ్యాక సొంత వ్యాపారాన్ని ప్రారంభించడమో, సంబంధిత రంగంలో ఉద్యోగం చేయడమో చేస్తుంటారు. కొందరు మంచి వేతనాల కోసం ఐటీ ఉద్యోగాలవైపు మొగ్గు చూపుతుంటారు. ఉద్యోగం ఏదైనా... ముందస్తుగా చదువుతున్నపుడే సన్నద్ధత ప్రారంభిస్తే భవిష్యత్తు ఎప్పుడూ బాగుంటుంది. అందుకు సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకోవడం, వాటిని సాధన చేయడం ద్వారా మెరుగైన కెరియర్‌ను నిర్మించుకోవచ్చు. 
నేడు ఏ రంగమైనా కంప్యూటర్‌ నైపుణ్యాలు తప్పక అవసరమవుతున్నాయి. డిగ్రీ చదువుతూ ఆ నైపుణ్యాలను చేజిక్కించుకోవాలనుకునేవారికి ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. త్వరితగతిన ఉద్యోగావకాశాలను అందించడం వీటి ప్రత్యేకత. పైగా ఇవి తక్కువ సమయంలో పూర్తవుతాయి. అయితే ఎవరికి ఏది తగినదో, ఏది కెరియర్‌లో మంచి ఎదుగుదలకు సాయపడుతుందో అభ్యర్థి ఆసక్తిపైనే ఆధారపడి ఉంటుంది. అభ్యర్థులు కోర్సులను ఎంచుకునేటపుడు భవిష్యత్తులో మంచి ఉద్యోగావకాశాలు కల్పించగల వాటిని ఎంచుకోవాలి. 
ఈ కోర్సులన్నింటికీ ఆంగ్లభాష, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తోడైతే కెరియర్‌లో త్వరగా అభివృద్ధి చెందగలుగుతారు. కొలువు సంపాదించుకునే దశలో నేర్చుకోవడంపై శ్రద్ధ చూపడం కంటే, డిగ్రీతోపాటుగా వీటిపై అవగాహన పెంచుకుంటే మేలే కదా! ఇలా చేయడం ద్వారా మిగతావారి కంటే ముందంజలోనూ ఉండొచ్చు. పైగా డిగ్రీ పట్టా పొందగానే ఎవరిపైనా ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడే అవకాశమూ దక్కుతుంది.



కామర్స్‌, ఆర్ట్స్‌ అభ్యర్థుల కోసం..  
కామర్స్‌ విభాగం అవకాశాలను కల్పించేదే అయినప్పటికీ, ఈ రంగంలో పోటీ ఎక్కువ. కాబట్టి అదనపు కోర్సులను అందిపుచ్చుకోవడం ఆవశ్యకం. ఇప్పుడు ప్రతి చిన్న వ్యాపార సంస్థల నుంచి కార్పొరేట్‌ ఆఫీసుల వరకూ తమ సంస్థల పేరుమీదుగా వెబ్‌సైట్లు, బ్లాగులున్నాయి. అంటే వెబ్‌ ప్రపంచంలో ప్రవేశించని సంస్థ దాదాపు లేదన్నమాట. ఈ పరిస్థితి ఇంకా విస్తృతమవుతుంది. కాబట్టి వెబ్‌ డిజైనింగ్‌కు భవిష్యత్తులో ఇంకా ఆదరణ ఉంటుంది.
1. వెబ్‌ డిజైనింగ్‌ కోర్సులు
వీటిలో  గ్రాఫిక్స్‌ను ఉపయోగించి నిర్వహణ యోగ్యమైన వెబ్‌సైట్‌ను తయారు చేయడం నేర్చుకుంటారు. సమాచారాన్ని అందంగా ఎలా పొందుపరచాలి, ఆకట్టుకునేలా ఎలా తీర్చిదిద్దాలి, లే అవుట్‌, కంప్యూటర్‌, మొబైల్‌ మొదలైన అన్ని డివైజ్‌ల్లో సులభంగా ఉపయోగించేలా ఎలా రూపొందించొచ్చో తెలుసుకుంటారు. కెరియర్‌ కోసమే కాకపోయినా దీనిలో నిష్ణాతులైతే సొంతంగా వ్యాపారాన్నీ ప్రారంభించుకోవచ్చు. సృజనాత్మక ఆలోచనలు, కొత్తగా ఆలోచించగల మనస్తత్వమున్నవారికి ఇది మంచి ఎంపిక.
నేర్చుకునే అంశాలు
* హెచ్‌టీఎంఎల్‌5, సీఎస్‌ఎస్‌3, జేక్వెరీ, జావా స్క్రిప్ట్‌
* బూట్‌స్ట్రాప్‌, రెస్పాన్సివ్‌, ఫొటోషాప్‌
* ఇలస్ట్రేటివ్‌, కోరెల్‌డ్రా, హెచ్‌టీఎంఎల్‌ స్లైసింగ్‌
జీతభత్యాలు: ప్రారంభ వేతనం కనీసం రూ.10,000 నుంచి రూ.15,000 వరకు ఉంటుంది.
ఈ కోర్సులు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. చదువుకు ఇబ్బంది కలుగకుండా ఇంట్లో ఉండే కోర్సులను చేయాలనుకునేవారు కింది వెబ్‌సైట్లను అనుసరించొచ్చు.
https://in.udacity.com/course/intro-to-html-and-css--ud001-india
https://www.udemy.com/html-css-javascript/
https://www.coursera.org/learn/html-css-javascript-forweb-developers
నేరుగా తరగతులకు హాజరై నేర్చుకోవాలనుకుంటే ఎన్‌ఐఐటీ, ఆప్‌టెక్‌ లేదా ఇతర ప్రైవేటు సంస్థల్లో చేరొచ్చు. ఎన్‌ఐఈఎల్‌ఐటీ- తిరుపతి, సీ-డాక్‌- హైదరాబాద్‌ వంటి ప్రభుత్వ సంస్థలూ అందుబాటులో ఉన్నాయి.
2. ఫొటోషాప్‌ డిజైనింగ్‌, గ్రాఫిక్‌ డిజైనింగ్‌ కోర్సులు
ఈ కోర్సులకూ సృజనాత్మకత ఉండాలి. దేన్నైనా రూపొందించడానికి క్రియాత్మక ఆలోచనలు, కొత్తదనం కోసం తపన.. ఈ లక్షణాలు ఉన్నవారు వీటిని ఎంచుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు తీసి వాటిని ప్రత్యేకంగా మలచడం వంటి వాటిపై ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి ఎంపిక.
డిగ్రీ పూర్తయ్యేలోపు ఈ రంగంలో బేసిక్‌ కోర్సులను నేర్చుకుని, ఆపైన కొంచెం అనుభవం సంపాదించుకోగలిగితే భవిష్యత్తు ఉద్యోగానికి మీకు మీరే హామీ ఇచ్చుకున్నట్లవుతుంది. ఒక పేజీ నుంచి సినిమా వరకు గ్రాఫిక్స్‌ అవసరం ఉంటుంది. భవిష్యత్తులో సినిమా రంగంలో ప్రముఖ పాత్ర గ్రాఫిక్స్‌దే అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక నిమిషం నిడివి ఉన్న వీడియోకి కనీసం 20-30 మంది నిపుణుల అవసరం ఉంటుంది. నైపుణ్యాన్ని బట్టి సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అభ్యర్థి నైపుణ్యాన్ని బట్టి నెలకు సుమారుగా రూ.6000 నుంచి రూ.5 లక్షల వరకు సంపాదించుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న కోర్సులు
https://alison.com/tag/digital-creative-design
https://www.udemy.com/topic/graphic-design/
https://www.format.com/magazine/resources/design/freeonline-graphic-design-courses
ఈ కోర్సులకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ లైసెన్సులు కొంచెం ఖరీదైనవి. కాబట్టి, ఆన్‌లైన్‌ కోర్సులతోపాటు దగ్గర్లో ఉన్న మల్టీమీడియా సంస్థలకు వెళ్లి నేరుగా నేర్చుకుంటే మంచిది. ప్రాక్టికల్‌ అనుభవం కూడా నైపుణ్యాలను పెంచేవే కదా!
3. సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌/ సోషల్‌ మీడియా ఆప్టిమైజేషన్‌ (ఎస్‌ఈఓ/ ఎస్‌ఎంఓ)
  రోజుకి కనీసం వెయ్యి వెబ్‌సైట్లు వస్తున్న రోజులివి. వచ్చినంత మాత్రాన వాటన్నింటికీ ప్రాధాన్యం ఉంటుందన్న నమ్మకమూ లేదు. వెబ్‌సైట్లన్నీ గూగుల్‌, యాహూ, ఎంఎస్‌ఎన్‌ మొదలైన సెర్చ్‌ ఇంజిన్‌లపైనే ఉండాలి. ప్రత్యేకమైన కీవర్డ్స్‌, మెటా పదాలు, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ ద్వారా గరిష్ఠ వినియోగదారులను చేరుకోవడానికి వెబ్‌ పోర్టళ్లకు దారిచూపడంలో సెర్చ్‌ ఇంజిన్‌ సాయపడుతుంది. కాబట్టి ఈ సెర్చ్‌ ఇంజిన్లు, వాటిపైన పని చేయడానికి ఎస్‌ఈఓ/ ఎస్‌ఎంఓ ఎగ్జిక్యూటివ్‌ల అవసరం ఉంటుంది. తమ తమ వెబ్‌సైట్లను సెర్చ్‌ పేజీలో ముందు స్థానంలో ఉండేలా చేయడమే వీరి ముఖ్య విధి. వీరు వినియోగదారులు ఎలాంటి కీవర్డ్స్‌ను ఉపయోగిస్తారో అంచనావేసి, వాటి ఆధారంగా వెబ్‌సైట్‌ వచ్చేలా చేస్తుంటారు. సృజనాత్మక నైపుణ్యాలతోపాటు ఆంగ్లభాషపై పట్టు, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు కూడా వీరికి అవసరమవుతాయి. ఫ్రెషర్లు...  ముఖ్యంగా ఇంటర్నెట్‌పై, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, గూగుల్‌+ వంటి సామాజిక మాధ్యమాలపై అవగాహన ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు.
నేర్చుకునే అంశాలు..
* సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, పీపీసీ
* సోషల్‌ మీడియా ఆప్టిమైజేషన్‌/ నెట్‌వర్కింగ్‌
* ఎస్‌ఈఓ ఆన్‌పేజ్‌, ఎస్‌ఈఓ ఆఫ్‌పేజ్‌, బ్యాక్‌ లింక్స్‌ మొదలైనవి
ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నవి..
https://www.emarketinginstitute.org/free-courses/seo-certification-course/
https://www.udemy.com/courses/marketing/searchengine-optimization/
https://www.simplilearn.com/digitalmarketing/search-engine-optimization-seo-certification-training
సుమారు రూ.8000-రూ.12,000 వరకు ప్రారంభవేతనాన్ని సంపాదించే అవకాశముంది. అనుభవం పెరిగేకొద్దీ సంపాదనా పెరుగుతుంది. ఇంటర్నెట్‌ వినియోగం, యాడ్‌ బిజినెస్‌, సోషల్‌మీడియా మార్కెటింగ్‌ విభాగాల్లో కెరియర్‌ నిర్మించుకోవచ్చు. సొంతంగా వ్యాపారాన్నీ ప్రారంభించుకోవచ్చు.
4. సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌
ఇది నేర్చుకున్నవారు సాఫ్ట్‌వేర్‌లో తలెత్తే లోపాలను కనుక్కుంటారు. వీటిని మాన్యువల్‌, ఆటోమేషన్‌ టెస్టింగ్‌ టూల్స్‌తో రెండు రకాలుగా తెలుసుకుంటారు. ప్రస్తుతం ఐటీ రంగంలో వీరికి ఎక్కువ గిరాకీ ఉంది. నైపుణ్యాన్ని పెంచుకుంటే భవిష్యత్తుకు ఢోకా ఉండదు. కాస్త ప్రోగ్రామింగ్‌లో ఆసక్తి ఉన్నవారికి ఈ కోర్సు ఉత్తమ ఎంపిక.
నేర్చుకునే అంశాలు
* సెలెనియమ్‌, క్యూటీపీ, బగ్‌జిల్లా, మ్యాంటిస్‌ వంటి మాన్యువల్‌ టెస్టింగ్‌ అండ్‌ ఆటోమేషన్‌ టూల్స్‌
ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నవి
https://www.udemy.com/courses/development/softwaretesting/
https://alison.com/courses/software-testing
https://www.guru99.com/software-testing.html
వీరికి నెలకు రూ.10,000-రూ.15,000 వరకు ప్రారంభజీతం ఉంటుంది.
డిగ్రీ ముగిసేలోపు తమ సబ్జెక్టుతో సంబంధమున్న కంప్యూటర్‌ బేసిక్‌ కోర్సులను నేర్చుకోవటం.. ఆపై కొంచెం అనుభవం సంపాదించుకోవటం... ఇలా చేస్తే ఉపాధికి ఢోకా ఉండదు!
సైన్స్‌ విద్యార్థులకు..
సైన్స్‌ విభాగాన్ని అవకాశాల వెల్లువగా అభివర్ణిస్తుంటారు. ఎంచుకునే వారి సంఖ్య, వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలతోపాటు ఉన్నతవిద్య అవకాశాలూ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ వంటి ప్రొఫెషనల్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రోగ్రామ్‌లకు ఇది మరింత వర్తిస్తుంది. కానీ బీఎస్‌సీ విషయానికి వచ్చినపుడు.. ఐటీ, కంప్యూటర్‌ రంగంలోకి ప్రవేశించాలంటే ఇంటర్‌లో మేథమేటిక్స్‌ సబ్జెక్టు ఉన్నవారికి అవకాశాలు ఒకప్పుడు ఎక్కువ.
అయితే ప్రోగ్రామింగ్‌లో నైపుణ్యం సాధిస్తే సబ్జెక్టుతో సంబంధం లేకుండా సంస్థలు తీసుకుంటున్నాయి.  ఇటీవల డీఆర్‌డీఓ 400 టెక్నికల్‌ పోస్టులకు ఇచ్చిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ. ప్రోగ్రామర్ల అవసరం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ ఉంది. బహుళ జాతి సంస్థలు కూడా బీఎస్‌సీతోపాటు టెక్నికల్‌ నైపుణ్యాలున్నవారిని ఎంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి.
బీఎస్‌సీ కంప్యూటర్స్‌ (మేథమేటిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌) విద్యార్థులు ప్రోగ్రామింగ్‌పై దృష్టిపెడితే ప్రోగ్రామర్‌గా కెరియర్‌ ప్రారంభించవచ్చు. వీరు సి, సి++, జావా, పైథాన్‌ వంటి ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ను ఎంచుకోవచ్చు.
https://cppinstitute.org
https://www.udemy.com/c-cplus-plus-java-programming-megaprimer-for-beginners/
https://www.udemy.com/c-c-python-ruby-javahtml5-php-programming-for-beginners/
https://www.edx.org/learn/c
https://www.edx.org/learn/java
బీఎస్‌సీ- మేథమేటిక్స్‌ విద్యార్థులు మేథమేటికా అనే సాఫ్ట్‌వేర్‌ను నేర్చుకుంటే చాలా మంచి అవకాశాలున్నాయి. మేథమేటికా అనేది మేథ్స్‌కు సంబంధించిన గణన ప్రోగ్రామింగ్‌. కొన్నిసార్లు బీజగణిత ప్రోగ్రామింగ్‌ అనీ పిలుస్తారు. దీన్ని అనేక శాస్త్రీయ, ఇంజినీరింగ్‌, మేథమేటికల్‌, కంప్యూటర్‌ రంగాల్లో వినియోగిస్తున్నారు. ఈ ప్రోగ్రామింగ్‌ను కూడా వూల్‌ఫ్రామ్‌, జావాలోనే రూపొందించారు. సి, సి++, జావా ఇప్పుడు పైథాన్‌ లాంగ్వేజ్‌లు చాలా పేరున్నవి.  ప్రోగ్రామింగ్‌ కెరియర్‌లో పునాది వీటిలో ప్రావీణ్యం సాధించడంతోనే మొదలవుతుంది. ఈ కోర్సులు ఆన్‌లైన్‌తోపాటు దగ్గర్లోని ఎన్‌ఐఐటీ, ఆప్‌టెక్‌ లేదా ఏదైనా ప్రైవేటు సంస్థల్లోకానీ నేర్చుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో నేర్చుకోవాలనుకుంటే కింది లింకులు సాయపడతాయి.
https://www.wolfram.com/mathematica/resources/
https://www.wolfram.com/wolfram-u/
https://www.lynda.com/Mathematica-training-tutorials/2011-0.html
https://www.onlinefreecourse.net>Academics
https://www.udemy.com/mathematica/
ఈ మేథమేటికా.. సరికొత్త సాంకేతికతలైన డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లాంగ్వేజ్‌ వంటి వాటికి ఎంతో ఉపయోగకరం. అందుకే ఈ కోర్సు ·మెరుగైన కెరియర్‌ను నిర్మించుకోవడానికీ సాయపడుతుంది. వీటితోపాటు సృజనాత్మకంగా ఆలోచించేవారైతే పైన తెలిపిన వెబ్‌, మల్టీమీడియా, గ్రాఫిక్‌ కోర్సులనూ ఎంచుకోవచ్చు.
ఈ కోర్సులన్నీ కంప్యూటర్స్‌, మ్యాథ్స్‌ వారికే కాకుండా బయాలజీ, ఇతర స్ట్రీములవారూ నేర్చుకోవచ్చు. వారి రంగాల్లో నిష్ణాతులు కావటానికి ఉపయోగకరంగా ఉంటాయి.  తమ సబ్జెక్టుల పరిధిలో డేటా సైన్స్‌, ఏఐ కోసం ఈ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది.
An Article from Eenadu. I have posted behalf of my blog because I think it is very useful content for every student.I hope it will be helpful for you all.Work hard never lose your hope.Any suggestions feel free to comment.I am writing this blog not only for myself  but I feel atleast some of the people may benifit by the content provided in it.Thank you.
Ajay

I am Ajay Bhanu, I have passion to write blogs to share information which might be helpful to you regarding Technology, Gadgets, Inspiring People etc., Purpose of Blog: To share unknown things, to inspire people and also to provide online offer information. Please follow and support me.

Post a Comment

Previous Post Next Post